తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఆర్ల శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ.

తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఆర్ల శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ.

తిరుపతి ప్రతినిధి :-  తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (పరిపాలన)గా ఆర్ల శ్రీనివాసులు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.

 

 

 

ఆర్ల శ్రీనివాసులు గతంలో తిరుపతి జిల్లాలో అదనపు ఎస్పీ (క్రైమ్స్)గా సమర్థవంతంగా సేవలందించారు. అనంతరం పలు కీలక హోదాల్లో విధులు నిర్వర్తించి విశేష అనుభవాన్ని సంపాదించారు. నంద్యాల జిల్లా నంద్యాల గ్రామీణ మండలం ఉడుమాల్పురం గ్రామానికి చెందిన ఆయన, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో ఎం.ఏ., బి.ఎడ్. పట్టాలు పొందారు.

1991 జూలై 15న సివిల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరిన ఆయన, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2005లో ఇన్‌స్పెక్టర్‌గా, 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది అనేక కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లాలో అదనపు ఎస్పీ (పరిపాలన)గా కూడా విధులు నిర్వర్తించారు.

 

 

 

సేవా కాలంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన ఆర్ల శ్రీనివాసులు మొత్తం 558 పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సేవా పతకం (2006), ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవా పతకం (2013), కేంద్ర ప్రభుత్వ అతి ఉత్కృష్ట సేవా పతకం (2019), డీజీపీ కమండేషన్ డిస్క్ అవార్డు (2021) వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయనకు లభించాయి.

 

 

 

నేర నియంత్రణలో కీలక పాత్ర పోషించిన ఆయన, దొంగతనాలకు పాల్పడిన నిందితుల నుంచి సుమారు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ ఆయుధాలు, కంట్రీ మేడ్ బాంబులను పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం నియంత్రణలోనూ విశేష కృషి చేశారు.

 

 

 

సాధారణ విజ్ఞానంపై ఆసక్తి కలిగిన ఆర్ల శ్రీనివాసులు 2005లో “బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర” కార్యక్రమంలో విజేతగా నిలవగా, 2014లో ప్రసారమైన “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమంలో రూ.12.50 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో తాడిపత్రిలో అందించిన విశిష్ట సేవలకు గాను 2020లో రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకున్నారు.

 

 

తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా బాధ్యతలు చేపట్టిన ఆర్ల శ్రీనివాసులు తమ అనుభవం, నిబద్ధతతో జిల్లా పోలీసు పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని జిల్లా పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.