పాల్వంచ జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం.

పాల్వంచ జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం.

కామారెడ్డి ప్రతినిధి:- పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు సామాజిక భద్రత, వ్యక్తిగత రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ సూచనలతో ఏఎస్సై నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

 

 

ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించాలి, మైనర్లపై జరిగే నేరాలను ఎలా నివారించాలి, మానవ అక్రమ రవాణాపై ఎలా అప్రమత్తంగా ఉండాలి వంటి అంశాలపై విపులంగా వివరించారు.

చదువుపై దృష్టి సారించి మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని, చిన్న పొరపాట్లు కూడా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని విద్యార్థులకు సూచించారు.

 

 

 

పోలీసు కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పోలీసు కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాత్మక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణపై పీసీ రాజేందర్ ప్రత్యేకంగా అవగాహన కల్పించగా, బ్లూ కోట్స్ సిబ్బంది గంగాధర్, హెచ్‌జీ భాస్కర్, రమేష్, రాంచంద్రం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే సైబర్ నేరాల బారిన పడినప్పుడు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం కోసం 1908కు, మహిళల భద్రత కోసం షీ టీమ్ – 8712686094ను, అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.