క్రిస్టోన్ సంస్థపై అక్రమ విద్యుత్ వినియోగం ఆరోపణలు.

క్రిస్టోన్ సంస్థపై అక్రమ విద్యుత్ వినియోగం ఆరోపణలు.

వర్ని  ప్రతినిధి రాహుల్ :-  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కొట్టే క్యాంపు గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న క్రిస్టోన్ సంస్థ నిర్వాహకులు విద్యుత్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంస్థ నిర్మిస్తున్న టోల్‌గేట్ వద్ద నీటి వినియోగం కోసం గతంలో కూడా ప్రభుత్వ విద్యుత్‌ను తప్పుడు మార్గంలో వినియోగించి విద్యుత్ సంస్థను మోసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని మండల విద్యుత్ శాఖ ఏఈ, డీఈ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు తక్షణమే స్పందించి సంస్థ విద్యుత్ సరఫరాను నిలిపివేసి తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

 

 

 

అయితే సంస్థ నిర్వాహకుల ఆగడాలు ఇంతటితో ఆగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం కొట్టే క్యాంపు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం సమీపంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ బోరు నుంచి అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని, రహదారి నిర్మాణ పనులకు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు గ్రామస్థులు గమనించినట్లు తెలిపారు. విద్యుత్ చట్టాలను పాటించకుండా నీటి వినియోగం పేరుతో అక్రమంగా విద్యుత్ వినియోగించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లడంతో పాటు రైతులకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ఇదే సంస్థపై అక్రమ విద్యుత్ వినియోగానికి సంబంధించి చర్యలు తీసుకున్నప్పటికీ, తాజాగా మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత విద్యుత్ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, అక్రమ విద్యుత్ వినియోగం నిజమని తేలితే జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న క్రిస్టోన్ సంస్థపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొట్టే క్యాంపు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.