మన ఊరు–మన భద్రత.. మన బాధ్యతపై పోలీసుల అవగాహన.
వర్ణి ప్రతినిధి చందర్:-
నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని వర్ణి బస్టాండ్ ఆవరణలో శనివారం “మన ఊరు–మన భద్రత.. మన బాధ్యత” పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ రామ్రాజ్, పీసీ సంజీవ్ కుమార్ ప్రయాణికులు, యువతకు భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, లైంగిక వేధింపులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు తల్లిదండ్రుల సూచనలు పాటించాలని, అపరిచితులతో పరిచయాలు, అనవసర ఫోన్ సంభాషణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని పోలీసులు హెచ్చరించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, జూదానికి దూరంగా ఉండాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తులతో అనవసర సన్నిహిత సంబంధాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ తమ భద్రతకు తామే బాధ్యత వహించాలని తెలిపారు.
తల్లిదండ్రుల సూచనలు పాటిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పోలీసులు ఆకాంక్షించారు.
