నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం ప్రతినిధి రాహుల్ : టీయూసీఐ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో 140వ మే డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా వద్ద బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ, కార్మికుల పని గంటలు పెంచే విధానాలను ఖండించారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద టీయూసీఐ రాష్ట్ర నాయకులు జే. మక్కయ్య జెండా ఎగురవేసి, ఎన్‌ఎంఆర్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రాకాసిపేట్ లయన్స్ క్లబ్ ఆసుపత్రి వద్ద సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ పార్టీ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్ జెండా ఆవిష్కరించి, ప్రపంచ యుద్ధాల భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని పేర్కొన్నారు.
హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు సీహెచ్. రమేష్ జెండా ఎగురవేసి, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
ఈ కార్యక్రమాల్లో కార్మిక నాయకులు, మహిళా సంఘ ప్రతినిధులు, రైతు సంఘ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మే డే స్ఫూర్తిని చాటిచెప్పారు.
