బోధన్‌లో ఎర్రజెండాల రెపరెపలు.. ఘనంగా 140వ మే డే వేడుకలు.

బోధన్‌లో ఎర్రజెండాల రెపరెపలు.. ఘనంగా 140వ మే డే వేడుకలు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్ : 140వ మే డే సందర్భంగా బోధన్ పట్టణంలో సీపీఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీతో పాటు అనుబంధ ప్రజా సంఘాలైన AIKMS, IFTU ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఎగురవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 

 

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ చౌరస్తా, మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట, అనిల్ టాకీస్ చౌరస్తా, అలాగే ఊట్‌పల్లి గ్రామంలో సుత్తి-కొడవలి గుర్తుతో ఉన్న ఎర్రజెండాలను ఆవిష్కరించారు.

 

 

ఈ సందర్భంగా AIKMS బోధన్ మండల అధ్యక్షులు ఎల్. చిన్న పర్వయ్య మాట్లాడుతూ, పని గంటల తగ్గింపు, శ్రమకు తగిన వేతనం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన చికాగో కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక ఉద్యమానికి మే డే ప్రేరణగా నిలిచిందన్నారు.

 

 

ఎర్రజెండా నాయకత్వంలో దేశవ్యాప్తంగా కార్మికులు, రైతు కూలీల హక్కుల కోసం అనేక పోరాటాలు జరిగాయని, భూ ఉద్యమాల ద్వారా నిరుపేదలకు లక్షల ఎకరాల భూములు అందించబడిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికుల హక్కులను రక్షించే చట్టాల సాధనలో కూడా ఎడమపక్ష ఉద్యమాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

 

 

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసి గ్రామీణ కూలీల జీవనాధారంపై ప్రభావం చూపుతోందని, ఇప్పటికే కార్మికులు సాధించిన హక్కులను బలహీనపరిచే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకువచ్చిందని విమర్శించారు. చికాగో కార్మికుల స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు, కూలీలు ఏకమై ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 

 

కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీలో ఎల్. చిన్న పర్వయ్య, మున్సిపాలిటీ కార్యాలయం వద్ద IFTU జిల్లా నాయకులు ఎస్. సుధాకర్, అనిల్ టాకీస్ చౌరస్తాలో పార్టీ సీనియర్ నాయకులు పేరోళ్ల పోశెట్టి, ఊట్‌పల్లి గ్రామంలో AIKMS జిల్లా నాయకులు ఎస్‌కే. రషీద్ జెండాలను ఆవిష్కరించారు.

 

 

ఈ వేడుకల్లో ఆర్. గౌతమ్ కుమార్, సూర్య, విఠల్, భూమయ్య, సుధాకర్, రషీద్, సమీర్, ప్రకాష్, జయరాం, లక్ష్మణ్, రఘు, ప్రతాప్, గంగారం, లావణ్య, సాయక్క తదితరులు పాల్గొన్నారు.