బాన్సువాడలో వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి.
బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కలు, కోతుల సమస్యను తక్షణమే నియంత్రించాలని కోరుతూ బాగువాన్ కమిటీ సభ్యులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్‌కు వినతిపత్రం సమర్పించారు.
పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, పండ్లు ధ్వంసం చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వివరించారు.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీధి కుక్కలు, కోతులను పట్టుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని కమిటీ సభ్యులు కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్ సమస్యను పరిశీలించి త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాగువాన్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ కాజీమ్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫాజిల్, సభ్యులు సమీర్, సజ్జాద్, ముబీన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
