సిద్ధులం ఆర్.ఎఫ్ గుట్టలు దత్తత ఇవ్వాలి: శ్రీ వీర హనుమాన్ కమిటీ విజ్ఞప్తి.
నిజామాబాద్ ప్రతినిధి రాహుల్: గోవుల సంరక్షణతో పాటు అడవి పరిరక్షణ కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని సిద్ధులం ఫారెస్ట్ ఆర్.ఎఫ్ కంపార్ట్‌మెంట్ నంబర్లు 223/1, 223/2లో ఉన్న ఐదు గుట్టలను తమ కమిటీకి దత్తత ఇవ్వాలని శ్రీ వీర హనుమాన్ కమిటీ ఉమ్మడి జిల్లా కలెక్టర్లను కోరింది.
కమిటీ అధ్యక్షుడు అమృత సాయి గౌడ్, ఆర్. మహేందర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ గుట్టలు ప్రస్తుతం ఆక్రమణలకు గురై అడవి నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులకు మేతగా ఉపయోగపడే గడ్డిని కొందరు దుర్మార్గులు నిప్పు పెట్టి కాల్చివేస్తుండడంతో పశువులకు ఆహార కొరత ఏర్పడిందని తెలిపారు.
గోవులు, అడవి, వన్యప్రాణులను రక్షించేందుకు ప్రభుత్వం సహకారంతో గుట్టల చుట్టూ 18 అడుగుల ట్రెంచ్ తవ్వించాలని, అలాగే గుట్టల సమీపంలో షెడ్లు నిర్మించాలని సూచించారు. ఇలా చేస్తే గోవులు పగలు మేత మేసి రాత్రి సురక్షితంగా ఉండగలవని పేర్కొన్నారు.
అదనంగా, ఉపాధి హామీ పథకం నిధులను గో సంరక్షణ మరియు వ్యవసాయ భూముల అభివృద్ధికి వినియోగిస్తే రైతులకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధులం ఆర్.ఎఫ్‌లోని ఐదు గుట్టలను తమ కమిటీకి దత్తత ఇవ్వాలని అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
