రాంపూర్‌లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బోధన్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెండు కుండలతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ డోలే సాయికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రయాణికులు, బాటసారులు చలివేంద్రం ద్వారా దాహం తీర్చుకోవాలని కోరారు. ఎండల ప్రభావం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు గ్రామ పంచాయతీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంటె సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి ఎండీ ఆరిఫ్, వార్డు సభ్యులు గంగుల లక్ష్మణ్, ఆనంద్ వాగ్మారెతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
