నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే పోచారం.
ఆలయ భూమిపూజ, ఇందిరమ్మ ఇంటి ప్రారంభం, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
బాన్సువాడ ప్రతినిధి రాహుల్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి గురువారం బాన్సువాడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో హనుమాన్ మందిరం పునఃనిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

అనంతరం రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో లబ్ధిదారుడు కాసుల సాయిలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తర్వాత బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణానికి చెందిన 71 మంది లబ్ధిదారులకు రూ.71,08,236, బాన్సువాడ గ్రామీణ మండలానికి చెందిన 72 మందికి రూ.72,08,352, నసురుల్లాబాద్ మండలానికి చెందిన 30 మందికి రూ.30,03,480 చొప్పున మొత్తం 173 మంది లబ్ధిదారులకు రూ.1,73,20,068 విలువైన చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూర్చే దిశగా కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమాల్లో మూడు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
