నిఘా నీడలో శనిగరం గ్రామం.. 30 సీసీ కెమెరాల ప్రారంభం.

నిఘా నీడలో శనిగరం గ్రామం.. 30 సీసీ కెమెరాల ప్రారంభం.

సిద్దిపేట అదనపు డీసీపీ కుషాల్కర్ చేతుల మీదుగా ప్రారంభం.

సిద్దిపేట జిల్లా ప్రతినిధి :- మండలంలోని శనిగరం గ్రామంలో భద్రతా పరిరక్షణకు కీలకమైన అడుగు పడింది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్‌వేస్ బయోఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సిద్దిపేట అదనపు డీసీపీ కుషాల్కర్ శుక్రవారం ప్రారంభించారు.

 

 

“సిద్దిపేట సురక్ష నేత్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఈ కెమెరాల ద్వారా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి జరిగే నిషేధిత గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

 

 

యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే డయల్-100 లేదా షీటీమ్‌ను సంప్రదించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.

గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సంస్థల ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీను, కోహెడ ఎస్సై అభిలాష్, స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, ఉప సర్పంచ్ పెరుక బుచ్చయ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.