హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మొియుద్దీన్ హత్య కేసులో కీలక నిందితులను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ ప్రతినిధి:- హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖైరతాబాద్ జోన్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన అడ్వకేట్ ఖాజా మొియుద్దీన్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు పలువురిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనం, నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, మే 23వ తేదీ ఉదయం మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం నుంచి స్విమ్మింగ్‌కు బయలుదేరిన అడ్వకేట్ ఖాజా మొియుద్దీన్‌పై నిందితులు పథకం ప్రకారం స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మొదట ప్రమాద ఘటనగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం విచారణలో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించి హత్య కేసుగా మార్పు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల పరిశీలనలో నిందితులు బాధితుడి ఇంటి సమీపంలో ముందుగానే వేచి ఉండి ఉద్దేశపూర్వకంగా వాహనంతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
వక్ఫ్ ఆస్తులు, సంబంధిత న్యాయ వివాదాల నేపథ్యంలో మృతుడు ఖాజా మొియుద్దీన్‌కు, నిందితుడు ముజాహిద్ ఆలమ్ ఖాన్ కుటుంబానికి మధ్య చాలాకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయని దర్యాప్తులో తేలింది. ఈ వివాదాల కారణంగా నిందితులు ద్వేషం పెంచుకుని హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం మేరకు, ముజాహిద్ ఆలమ్ ఖాన్, మహబూబ్ ఆలమ్ ఖాన్ తమ అనుచరులతో కలిసి రూ.15 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లింగ్‌కు ఒప్పందం కుదుర్చుకుని, పలుమాసాలుగా బాధితుడిపై నిఘా పెట్టి మే 23న దాడి అమలు చేసినట్లు గుర్తించారు.

ఈ కేసులో ముజాహిద్ ఆలమ్ ఖాన్, మహబూబ్ ఆలమ్ ఖాన్, కిషన్ అలియాస్ పప్పు, వినయ్, అభిజీత్ అలియాస్ నాని, విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ, మనీదీప్ అలియాస్ పోగో నాని తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు దర్యాప్తును అబిడ్స్ డివిజన్ ఏసీపీ పి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ సైదులు, ఎస్‌ఐ ఎం.ఏ. ఆదిల్ రియాజ్ ఖాన్ మరియు సిబ్బంది నిర్వహించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు.
