సైఫాబాద్ పోలీసుల భారీ డ్రగ్స్ పట్టివేత.. 21.251 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు మహిళలు అరెస్ట్.

హైదరాబాద్ ప్రతినిధి: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సైఫాబాద్ పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. విశాఖపట్నం నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న 21.251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.

 

విశ్వసనీయ సమాచారం మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎం. స్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మే 29న లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ సమీపంలో నిఘా నిర్వహించింది. సాయంత్రం 4.25 గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్ ప్రాంతంలో మూడు లగేజీ బ్యాగులతో సంచరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, బ్యాగుల్లో దాచిన 19 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.

 

అరెస్టైన నిందితులు టిప్పిగిరి లక్ష్మి (నారాయణపేట్ స్వస్థలం, ప్రస్తుతం ముంబై నివాసి), సందీప్‌కౌర్ మక్కన్ సింగ్ (ముంబై నివాసి)గా పోలీసులు గుర్తించారు. విచారణలో వీరు విశాఖపట్నంలో గంజాయి కొనుగోలు చేసి ముంబైలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించారు. ఈ వ్యవహారంలో బేబీ, సంపత్ అనే ఇద్దరు పరారీలో ఉన్న సహచరుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.

 

ఈ కేసులో 21.251 కిలోల గంజాయి, మూడు లగేజీ బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.