పాఠశాల నిధుల మాయంపై ఆర్డీవోకు ఫిర్యాదు.

పాఠశాల నిధుల మాయంపై ఆర్డీవోకు ఫిర్యాదు.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:-  బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బోధన్ జేఏసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించాయి.

 

 

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగరాజు, కో-కన్వీనర్ తల్లరే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు నిధులు కేటాయిస్తున్నాయని పేర్కొన్నారు.

 

 

 

అయితే ఆ నిధులను విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన ప్రధానోపాధ్యాయుడు వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత నాలుగు సంవత్సరాల అడ్మిషన్లు, విద్యార్థుల రికార్డులు గల్లంతయ్యాయని చెబుతూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

 

 

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశ్నించినప్పుడు నకిలీ ఆధారాలు, ఫేక్ బిల్లులు చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పెయింటింగ్ తదితర పనుల పేరుతో తప్పుడు ఖర్చులు చూపిస్తున్నారని పేర్కొన్నారు.

 

 

పాఠశాలలో ఇప్పటికీ మరుగుదొడ్లు, తాగునీటి వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, దుర్వినియోగమైన మొత్తాన్ని తిరిగి పాఠశాల ఖాతాలో జమ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్. బాలరాజ్, కిరణ్, ప్రశాంత్, రాజన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.