రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు బోధన్ విద్యార్థుల ఎంపిక.
జిల్లా స్థాయిలో సత్తా చాటిన సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులు.
బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-11 చెస్ ఛాంపియన్‌షిప్‌లో బోధన్‌కు చెందిన సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జిల్లా స్థాయి బాలికల విభాగంలో ఎం. నిత్య శ్రీ ప్రథమ స్థానం సాధించి జిల్లా ఛాంపియన్‌గా నిలవగా, ఎస్. సాయి సహారా ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
బాలుర విభాగంలో ఎం. హితేంద్ర, ఎం. సాయి సాక్షిత్ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. వీరితో పాటు అకాడమీకి చెందిన ఎం. వేద శ్రీ, ఎం. నాగశ్వీన్, కె. సమర్థ్, ప్రణవ్, అభినందన్, బ్రహ్మీని, రుద్రాక్షి కూడా హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అండర్-11 చెస్ ఛాంపియన్షిప్–2026లో పాల్గొననున్నారు.
ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జూన్ 26, 27, 28 తేదీలలో హైదరాబాద్‌లోని Lal Bahadur Stadiumలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా అకాడమీ కోచ్, కోఆర్డినేటర్ సాయిబాబా సామల మాట్లాడుతూ, బోధన్ ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే చెస్ క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సమ్మర్ క్యాంపులు, టోర్నమెంట్ ప్రిపరేషన్ సెషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన చెస్ సమ్మర్ క్యాంప్ ద్వారా అనేక మంది విద్యార్థుల్లో చెస్ పట్ల ఆసక్తి పెరిగిందని, జిల్లా స్థాయిలో విజయాలు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు.
భవిష్యత్తులో బోధన్ నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులను క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభినందిస్తూ, పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించి బోధన్ పట్టణం, నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
