బోధన్‌లో విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్‌రైటింగ్ శిక్షణ ప్రారంభం.
బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆజంగంజ్ గంజి హైస్కూల్‌లో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, అందమైన చేతిరాత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైటల్ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్‌రైటింగ్ శిక్షణ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.
9వ, 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ శిక్షణా తరగతులు ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే వరకు నిరంతరం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ లంక రవి, మాజీ జిల్లా గవర్నర్ లయన్ లక్ష్మి, జీఈటీ కో-ఆర్డినేటర్ లయన్ శ్యాం సుందర్ పహాడే, జోన్ చైర్మన్ లంక జెరూషా, క్లబ్ డైరెక్టర్ పి. నాగభూషణం, ప్రధానోపాధ్యాయులు చక్రవర్తి, అధ్యాపకులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే విద్యా, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైటల్ ప్రతినిధులు తెలిపారు.
