కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం.
బోధన్ ప్రతినిధి రాహుల్ : ప్రతిఘటన పోరాటయోధుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు. గురువారం బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ, దేశంలో ఎమర్జెన్సీ సమయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అజ్ఞాత జీవితంలోకి వెళ్లి విప్లవ ప్రస్థానాన్ని ప్రారంభించారని తెలిపారు. నక్సల్బరీ ఉద్యమం ప్రభావం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన, తన అన్నయ్య రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న), పెదనాన్న వెంకటనారాయణల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ నూతన ప్రజాస్వామ్య విప్లవానికి అంకితమయ్యారని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ అనంతరం పార్టీ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. అనంతరం హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో పనిచేశారని, 1996లో ఇల్లెందు ప్రాంతంలో దళ నాయకుడు కామ్రేడ్ ఎల్లన్న ఎన్కౌంటర్లో మరణించిన అనంతరం అక్కడ పార్టీ బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహించిన ఆయన, రైతాంగ ఉద్యమంలో అఖిలభారత స్థాయి నాయకుడిగా ఉత్తర భారతదేశంలో పర్యటించారని, ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రక రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.
పార్టీలో జరిగిన అంతర్గత సిద్ధాంత పోరాటంలో ప్రజాపంథా వైపు నిలిచిన కామ్రేడ్ చంద్రశేఖర్ మన మధ్య లేకపోవడం తీవ్ర లోటని బి. మల్లేష్ అన్నారు. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్, ధ్యాకం పోశెట్టి, ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణితో పాటు లక్ష్మి, పద్మ, సావిత్రి, పోసాని, రాజమణి, అనసూయ, రమ, సుశీల, గంగామణి, సిహెచ్. రమేష్, రాములు, ఎస్.కె. పాషా, కాజా, గంగారం, చిన్నయ్య, శంకర్, సురేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
