నీట్ లీకేజీపై పార్లమెంట్లో చర్చించాలి: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఎస్ఎఫ్ఐ బహిరంగ లేఖ.
ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్.
బోధన్ ప్రతినిధి రాహుల్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో గందరగోళం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు తదితర అంశాలపై రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ను కోరుతూ ఎస్ఎఫ్ఐ బహిరంగ లేఖ విడుదల చేసింది.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత కమిటీ పిలుపు మేరకు శుక్రవారం బోధన్ మండలంలోని హమాల్వాడిలో ఉన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు దేశవ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు.
అయితే నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు, అవకతవకలు, ఫలితాలపై నెలకొన్న అనుమానాలు, పరీక్షల నిర్వహణలో గందరగోళం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడటం సరికాదని విమర్శించారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కేంద్రీకృతం చేయడం వల్లే పరీక్షల నిర్వహణలో సమస్యలు, పేపర్ లీకేజీలు పెరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాటైన తర్వాత యూజీసీ-నెట్, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై ఆరోపణలు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏను వెంటనే రద్దు చేసి, పరీక్షలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే పర్యావరణవేత్త, శాస్త్రవేత్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాచకొండ విఘ్నేష్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
కాబట్టి రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పేపర్ లీకేజీ, ఎన్టీఏ రద్దు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించాలని ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తి దేశంలోని విద్యార్థులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఆజాద్, జిల్లా నాయకులు రాజు, అభి తదితరులు పాల్గొన్నారు.
