ఢిల్లీలో నిరసనకారులపై దాడులకు వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళన.
బోధన్ ప్రతినిధి రాహుల్:-
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, యువకులపై జరిగిన పోలీసు చర్యలను ఖండిస్తూ బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పుట్ట వరదయ్య మాట్లాడుతూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులు, యువకులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం చేయడం అమానుషమని ఆరోపించారు.
నిరసనకారులపై పెల్లెట్లు ప్రయోగించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై అణచివేత చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడకుండా నిరసనలను అణచివేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు ఎండి ఇర్షాద్, గంగారాం, సీపీఐ(ఎం) నాయకులు గోపి, సీపీఐ(యు) మోసిన్, ఫార్వర్డ్ నాయకులు నాగరాజుతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
