ప్లాస్టిక్ రహిత వర్ని కోసం విద్యార్థుల అవగాహన ర్యాలీ.

ప్లాస్టిక్ రహిత వర్ని కోసం విద్యార్థుల అవగాహన ర్యాలీ.

వర్ని ప్రతినిధి చందర్: ప్లాస్టిక్ రహిత వర్ని మండల కేంద్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు.

 

 

ఈ సందర్భంగా విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నినాదాలు చేశారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్ర సంచులను వినియోగించాలని సూచించారు.

గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని నిర్వాహకులు కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు.

 

 

విద్యార్థుల అవగాహన కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల్లో ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై చైతన్యం పెరిగింది. పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌ పురం గ్రామపంచాయతీ సర్పంచ్ కనకదుర్గ రవి, గ్రామ కార్యదర్శి నాగరాజు, ఉపసర్పంచ్ రెడ్డి శ్రీరాములు, వార్డు సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.