అండర్-17 చెస్‌లో బోధన్ విద్యార్థుల సత్తా.
జిల్లా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాయి సామల చెస్ అకాడమీకే
బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్-17 జిల్లా స్థాయి చెస్ సెలెక్షన్ టోర్నమెంట్–2026లో బోధన్‌కు చెందిన సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. అండర్-17 బాలుర విభాగంలో అకాడమీకి చెందిన రిష్విక్ బొర్రొల్లా జిల్లా ప్రథమ స్థానం, జిల్లా ఛాంపియన్ గౌరంగ అశోక్ ద్వితీయ స్థానం సాధించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో రిష్విక్, గౌరంగ వ్యూహాత్మక ఆలోచన, ఏకాగ్రత, సమయపాలనతో అద్భుత ఆటతీరును ప్రదర్శించి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.
ఒకే అకాడమీకి చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించడం బోధన్‌లో చెస్ క్రీడకు పెరుగుతున్న ఆదరణకు, విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా సాయి సామల చెస్ అకాడమీ కోచ్, కోఆర్డినేటర్ సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, టోర్నమెంట్ అనుభవం, విద్యార్థుల పట్టుదలే ఈ విజయానికి కారణమని తెలిపారు. విద్యార్థులను జిల్లా స్థాయికే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే అకాడమీ లక్ష్యమన్నారు.

విద్యార్థులకు ఓపెనింగ్స్, టాక్టిక్స్, మిడిల్ గేమ్ వ్యూహాలు, ఎండ్‌గేమ్ టెక్నిక్స్, చెస్ నోటేషన్, గేమ్ అనాలిసిస్, టైమ్ మేనేజ్మెంట్, టోర్నమెంట్ ప్రిపరేషన్‌పై ప్రణాళికాబద్ధమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన చెస్ సమ్మర్ క్యాంప్–2026తో పాటు రెగ్యులర్ కోచింగ్ ద్వారా విద్యార్థుల్లో చెస్‌పై ఆసక్తి, ఏకాగ్రత, పోటీ స్ఫూర్తి మరింత పెరిగిందన్నారు.

భవిష్యత్తులో బోధన్ నుంచి మరెందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి చెస్ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. విజేతలను తల్లిదండ్రులు, క్రీడాభిమానులు, విద్యావేత్తలు అభినందిస్తూ రాబోయే రాష్ట్ర, జాతీయ పోటీల్లోనూ రాణించి బోధన్, నిజామాబాద్ జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
