రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వంపై సామా మహేందర్ రెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి వినోద్: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఆరు గంటల విద్యుత్‌తో రైతులు పంటలు ఎలా పండించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి సామా మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

మహేశ్వరం మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రైతులకు సకాలంలో విద్యుత్ అందకపోతే పంటలు ఎలా సాగు చేయగలరని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాత్రింబవళ్లు పొలాల వద్ద విద్యుత్ కోసం ఎదురుచూసే పరిస్థితి రైతులకు రావడం బాధాకరమన్నారు. విద్యుత్ కోతలను తక్షణమే నివారించి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

 

కేసీఆర్ హయాంలో అందించిన ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిందని సామా మహేందర్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

 

 

విద్యుత్ కోతల కారణంగా రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

 

రైతుల కోసం పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధం

ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, రైతుల పంటలను కాపాడాలని సామా మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.