షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: జూనియర్ సివిల్ జడ్జి మల్యాల సాహితి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి వినోద్ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా షాద్‌నగర్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి మల్యాల సాహితి హాజరయ్యారు.

 

 

ఈ సందర్భంగా జడ్జి మల్యాల సాహితి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ న్యాయ సేవలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

 

అలాగే, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు తగిన నిపుణుల సలహాలు, కౌన్సెలింగ్ సేవలు పొందాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో న్యాయశాఖ అధికారులు, వైద్యాధికారులు, సైకాలజిస్టులు, కౌన్సెలింగ్ నిపుణులు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో సవియా సుల్తానా, టీ. ఆంజనేయులు గౌడ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ గోవింద్, ఎస్సై రాజు, పారా లీగల్ వాలంటీర్లు టీ. బాలరెడ్డి, కే. సంజీవ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.