కడ్తాల్ ప్రతినిధి వినోద్: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో వోల్టేజీ సమస్యల కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడు గ్రామంలో విద్యుత్ సమస్యల కారణంగా ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించారు. రైతులు వెలజలరా బాలరాజ్, గొల్లపెల్లి పాండుగౌడ్తో పాటు పలువురు రైతులకు చెందిన పంటలను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పెట్టుబడులు పెట్టిన పంటలు ఎండిపోయాయని, కొందరు రైతులు మూడు ఎకరాల వరకు పంట నష్టపోయారని రైతులు ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో నాణ్యతా లోపాల కారణంగా తరచూ లో వోల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. దీంతో వ్యవసాయ బోరు మోటార్లు సైతం దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆరు గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్ అందకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొప్పిడి గోపాల్, ఉపసర్పంచ్ బందరు యాదయ్య, మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వీరయ్య, మాజీ ఎంపీటీసీలు యాదయ్య, రంగయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, వార్డు సభ్యుడు రవికుమార్‌తో పాటు నాయకులు బండ లింగం, బిక్షపతి, రామకృష్ణ, పాండు, జమీర్, పవన్ కుమార్, రామచంద్రయ్య గౌడ్, రమేష్, యాదయ్య, నరసింహ, సాయికుమార్, రమేష్ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
