ట్రాలీ బ్యాగుల్లో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.

డీఆర్‌ఐ అధికారుల దాడులు.. ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్

రంగారెడ్డి ప్రతినిధి వినోద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో నిర్వహించిన తనిఖీలకు సంబంధించి అక్టోబర్ 24న ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసినట్లు సమాచారం.

 

 

అధికారులకు అందిన పక్కా సమాచారంతో కౌలాలంపూర్ వెళ్లే ఎయిర్‌ఏషియా విమానం ఏకే-68లో ప్రయాణించేందుకు సిద్ధమైన ఓ భారతీయ పురుష ప్రయాణికుడిని అడ్డుకుని అతడి క్యాబిన్ బ్యాగేజీని తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగులో దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో దాచిన 66,600 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియా రింగిట్లు, రెండు సింగపూర్ డాలర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

 

 

విచారణలో అదే విమానంలో మరో పీఎన్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న మహిళ గురించి సమాచారం లభించడంతో అధికారులు ఆమెను గుర్తించి తనిఖీ చేశారు. ఆమె బ్యాగేజీలో దాచిన 97,600 అమెరికన్ డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద కలిపి 1,64,200 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియా రింగిట్లు, రెండు సింగపూర్ డాలర్లు లభించగా, వీటి మొత్తం విలువ సుమారు రూ.1.56 కోట్లుగా అంచనా వేశారు.

 

 

విదేశీ కరెన్సీకి సంబంధించి చట్టబద్ధమైన పత్రాలు సమర్పించలేకపోవడంతో కరెన్సీతో పాటు ట్రాలీ బ్యాగులను కస్టమ్స్ చట్టం, 1962 ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, దానిని విదేశాలకు తరలించడం వెనుక ఎవరున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.