నరసింహులు మృతికి బాధ్యత ఎవరిది?

కలెక్టర్ ఆదేశించినా అమలుకాని చౌరస్తా విస్తరణ పనులు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆర్ఎన్ రాము ఆగ్రహం

షాద్‌నగర్  ప్రతినిధి వినోద్: షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని చౌరస్తా విస్తరణ ఉద్యమ నాయకుడు ఆర్ఎన్ రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 26న సాయంత్రం 6:15 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంజర్ల గ్రామానికి చెందిన నర్సింహులు తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఘటన చౌరస్తా విస్తరణపై అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి ఎత్తిచూపుతోందని విమర్శించారు.

 

గత ఏడాది కాలంగా చౌరస్తా విస్తరణ చేపడతామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆచరణలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని రాము మండిపడ్డారు. చౌరస్తా పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని రహదారులు, భవనాల శాఖ అధికారులు పేర్కొంటున్నప్పటికీ వాటిని తొలగించేందుకు మున్సిపల్ యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమాల తొలగింపులో జాప్యం వెనుక కారణాలేమిటో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 

జిల్లా కలెక్టర్ ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో చౌరస్తా విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. కలెక్టర్ ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయిందా? లేక మున్సిపల్ అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

చౌరస్తా విస్తరణలో జరుగుతున్న జాప్యానికి మున్సిపల్ కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారి పావని, మున్సిపల్ చైర్మన్ అగనూరు బస్వేశ్వర్ నైతిక బాధ్యత వహించాలని ఆర్ఎన్ రాము డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చౌరస్తా సమస్యను పరిష్కరించకుండా ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించారు.

 

నర్సింహులు మృతికి దారితీసిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని, చౌరస్తా విస్తరణ పనులను తక్షణమే ప్రారంభించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. మరో ప్రాణం బలికాకముందే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్ఎన్ రాము డిమాండ్ చేశారు.