ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు బీజేవైఎం–బీజేపీ భారీ ర్యాలీ.

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు బీజేవైఎం–బీజేపీ భారీ ర్యాలీ.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం బాన్సువాడ పట్టణంలో కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది.

 

 

 

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

 

 

 

పెండింగ్‌లో ఉన్న నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంలో విఫలమైన ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్, నసూరాబాద్ మండల అధ్యక్షుడు హనుమాన్లు, బీర్కూర్ మండల అధ్యక్షుడు సాయికిరణ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు తృప్తి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.