బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి పురస్కారం.

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి పురస్కారం.

కామారెడ్డి ప్రతినిధి:- కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు అందించిన ఆసుపత్రులను ఎంపిక చేయగా, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకుంది.

 

 

ప్రత్యేకంగా ఆసుపత్రిలో అధిక సంఖ్యలో ప్రసవాలు నిర్వహించడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్ అవార్డును అందుకున్నారు.

 

 

 

ఈ అవార్డు అందుకోవడం పట్ల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ, ఈ పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని, ప్రజలకు ఎల్లప్పుడూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ అవార్డును ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

 

 

ఈ సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి సహా అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

 

భవిష్యత్తులో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.