పోసానిపేటలో పోలీసుల అవగాహన కార్యక్రమం.. ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని సూచన.
కామారెడ్డి ప్రతినిధి :- రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, కామారెడ్డి సబ్‌డివిజన్ డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని గ్రామస్తులకు సూచించారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలపై అప్రమత్తత, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, సైబర్ ఫిర్యాదుల కోసం 1930 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

అలాగే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేర నియంత్రణకు తోడ్పాటు ఉంటుందని వివరించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాత్మక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, పీసీ రాములు, సర్పంచ్ లింగం, క్రీడా సంఘం అధ్యక్షుడు తిరుపతి, గ్రామ మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
