ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్.
బోధన్ మండలం ప్రతినిధి రాహుల్ :- ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ ఆరోపించారు. బుధవారం బోధన్ మండలం అందాపూర్ గ్రామ చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ నాయకులు సందర్శించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ, మండుతున్న ఎండల్లో పని చేస్తున్న కూలీలకు రక్షణగా టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, గాయాలు జరిగినప్పుడు చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం లేకపోవడం, కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. కూలీలకు వారం వారంగా చెల్లించాల్సిన వేతనాలు ఆలస్యమవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో వెంటనే టెంట్లు, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉంచాలని, కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో ఉపాధి హామీ పనులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందించేదని, ప్రస్తుతం వాటిని 60 శాతానికి తగ్గించిందని, రాష్ట్ర వాటా 10 శాతం నుంచి 40 శాతానికి పెరగడంతో నిధుల కొరత ఏర్పడిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ పేదలను ఉపాధి లేని పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు లక్ష్మణ్ పాల్గొన్నారు.
