కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జె. శంకర్ గౌడ్.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- కార్మికుల సమస్యలపై బోధన్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జె. శంకర్ గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలుగా నిర్ణయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులు తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన పాలకులు లక్షల్లో వేతనాలు పొందుతూ, కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు.
సుప్రీంకోర్టు సూచించిన కనీస వేతనం రూ.26 వేలును కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లను వెంటనే అమలు చేసి ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, పత్రి ఎల్లయ్య, ట్రేడ్ యూనియన్ నాయకులు బషీర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.
