బోధన్‌లో 32 సీసీ కెమెరాల ప్రారంభం.
‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సాయి చైతన్య.
బోధన్ ప్రతినిధి రాహుల్: బోధన్ పట్టణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమం కింద 32 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, “ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవచ్చు. నేరాల నివారణతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో కూడా కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి” అని పేర్కొన్నారు.

ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖకు సహకరించాలని, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వార్డు కౌన్సిలర్ తమ వార్డులో కనీసం ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
బోధన్ టౌన్‌లో 32 కెమెరాల ఏర్పాటుకు సహకరించిన బంగారం దుకాణాల సంఘం అధ్యక్షుడు కదం ప్రమోద్‌ను సీపీ సన్మానించారు. అలాగే డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణపై వాల్ పెయింటింగ్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న సమీర్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్‌ఐలు మచ్చేందర్, మనోజ్ కుమార్, మహేష్, వైస్ చైర్మన్ ఇలియాస్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

