నగర సమస్యల పరిష్కారంలో పాలకవర్గం విఫలం: సిపిఎం.

వీధి కుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలి: సిపిఎం.

కరీంనగర్ ప్రతినిధి : నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా పెరిగిందని, ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. ఆదివారం కోతి రాంపూర్‌లోని ముకుంద లాల్ మిశ్రా భవన్‌లో నిర్వహించిన సిపిఎం నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

 

 

సుభాష్ నగర్, గాంధీ రోడ్, భగత్ నగర్, సప్తగిరి కాలనీ, అంబేద్కర్ నగర్, సాయి నగర్, కలెక్టరేట్ రోడ్ తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తూ, వాహనదారులను వెంబడించి గాయపరుస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వీధి కుక్కల నియంత్రణలో పాలకవర్గం విఫలమైందని విమర్శించారు.

 

 

 

లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఉన్నప్పటికీ కరీంనగర్ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ నిర్దిష్ట సమయానికి మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

నగరంలోని డంప్ యార్డ్ సమస్య, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల ఆలస్యం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు. రైల్వే గేటు మూసివేతల కారణంగా అంబులెన్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కొని రోగులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఓబీ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు.

 

 

ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గం తక్షణ చర్యలు తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పుల్లెల మల్లయ్య, పున్నం రవి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.