ఎల్లయ్య చెరువు పై అఖిలపక్ష సమావేశం.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ :- బాన్సువాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం ఎల్లయ్య చెరువు మట్టి తరలింపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాన్సువాడ మున్సిపల్‌కు చెందిన ప్రతిపక్ష కౌన్సిలర్లు అధ్యక్షత వహించారు.
సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతూ, చెరువు సుందరీకరణ పేరుతో ఎల్లయ్య చెరువులోని మట్టిని నిజమైన రైతులకు కాకుండా ఇటుక బట్టీలు, వెంచర్ యజమానులు, చెరువు పక్కన ఉన్న ప్లాట్‌ల వారికి వందలాది టిప్పర్ల ద్వారా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇదేనా అభివృద్ధి అంటూ అధికార పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు.
మున్సిపల్‌లోని ఏడుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఇప్పటికే ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. ఇటీవల కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే మట్టి అక్రమ తరలింపును ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల పొలాలకు మట్టిని పంపితేనే నిజమైన అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, మామిళ్ల రాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, తృప్తి ప్రసాద్, టీడీపీ నాయకుడు శంషుద్దీన్‌తో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లు పాల్గొన్నారు.
