అకాడమీల పేరుతో అక్రమ ఇంటర్ అడ్మిషన్లు.

అకాడమీల పేరుతో అక్రమ ఇంటర్ అడ్మిషన్లు.

అనుమతి లేని సంస్థలను వెంటనే మూసివేయాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్.

కరీంనగర్ ప్రతినిధి :- Students’ Federation of India ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. అకాడమీల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను తక్షణమే మూసివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

 

 

 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలో ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు లేకుండానే కొన్ని కోచింగ్ అకాడమీలు యథేచ్ఛగా అడ్మిషన్లు చేపడుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఆకాష్, బన్సాల్, రాంక్ ఫోర్డ్ వంటి అకాడమీలకు ఇంటర్మీడియట్ కళాశాలల అనుమతులు లేకపోయినా, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు.

ఈ అకాడమీలు తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యార్థులను గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీల్లో ఎన్‌రోల్ చేయిస్తూ ఆయా కాలేజీల నుంచి భారీ కమిషన్లు పొందుతున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులు తాము అసలు ఏ కాలేజీలో చదువుతున్నామో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అకాడమీల నిర్వాహకులు చట్టాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అక్రమంగా విద్యార్థులను చేర్చుకుంటున్న ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేసి, తల్లిదండ్రులను మోసం చేస్తున్న నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 

 

 

అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అకాడమీల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు వినయ్, సహాయ కార్యదర్శి భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.