బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు ప్రారంభం.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రశిక్షణ శిబిరాలు మంగళవారం బాన్సువాడ పట్టణంలోని జీఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమయ్యాయి. జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన ప్రారంభమైన ఈ శిబిరాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.
ఈ శిక్షణ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికుల మాదిరిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై అధికారులను, అధికార పార్టీ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి Narendra Modi ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని అన్నారు.
శిబిరం రెండో రోజు జరిగే ముగింపు సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు N. Ramchander Rao హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, అరుణతార, మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

