అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్య.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్య.

మిస్సింగ్ కేసును ఛేదించిన నారాయణఖేడ్ పోలీసులు.. ముగ్గురు అరెస్ట్

సంగారెడ్డి ప్రతినిధి :- సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ పరిధిలో సంచలనం రేపిన మిస్సింగ్ కేసును నారాయణఖేడ్ పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడు, అతని అన్నతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నారాయణఖేడ్ ఇన్‌స్పెక్టర్ Srinivas Reddy తెలిపారు.

 

 

సంగారెడ్డి జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన శంబనోల్లా ముత్యం రెడ్డి (35) బోర్ మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో, 18వ తేదీన అతని భార్య శంబనోల్లా కల్పన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్రైమ్ నెం.127/2026 కింద మాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

 

 

విచారణలో కల్పన ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కల్పనకు మానూర్ మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరితో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పండరిని అదుపులోకి తీసుకుని విచారించగా, కల్పనతో పాటు తన అన్న గైని విట్టల్ కలిసి ముత్యం రెడ్డిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

 

 

 

పోలీసుల వివరాల ప్రకారం, కల్పన మరియు పండరి మధ్య కొంతకాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన ముత్యం రెడ్డి పలుమార్లు భార్యను మందలించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భర్త తమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని భావించిన కల్పన, ప్రియుడు పండరితో కలిసి హత్యకు పథకం రచించింది.

 

 

తేదీ 16.05.2026న ముత్యం రెడ్డిని బోర్ మోటార్ స్టార్టర్ రిపేర్ పని ఉందని నమ్మించి పొలానికి తీసుకెళ్లిన పండరి, అక్కడ ముందుగా సిద్ధంగా ఉన్న తన అన్న విట్టల్‌తో కలిసి తాడుతో మెడ బిగించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని జేసీబీతో ముందుగానే తవ్విన గుంతలో పడేసి మట్టితో పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది.

 

అరెస్టైన నిందితులు:

1. గైని పండరి (24), మెకానిక్, ఎల్గోయి గ్రామం, మానూర్ మండలం.

2. గైని విట్టల్ (33), ఎల్గోయి గ్రామం, మానూర్ మండలం.

3. శంబనోల్లా కల్పన (30), గంగాపూర్ గ్రామం.