నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమ నాయకులపై కేసు కొట్టివేత.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమ నాయకులపై కేసు కొట్టివేత.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం పోరాటం చేసిన నాయకులపై 2018లో నమోదైన కేసును బోధన్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సాక్ష్యాధారాలు సమర్పించడంలో పోలీసులు విఫలమవడంతో న్యాయస్థానం ఉద్యమ నాయకులను నిర్దోషులుగా ప్రకటించింది.

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీ మేరకు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజాం షుగర్ రక్షణ కమిటీ, తెలంగాణ సామాజిక పార్టీ ఆధ్వర్యంలో 2018లో రిలే నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు నిర్వహించారు. అనంతరం జరిగిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పలువురు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

 

 

 

ఈ కేసులో బీర్కూర్ శంకర్, బి. మల్లేష్, పుట్ట వరదయ్య, లేట్ వి. రాఘవులు, గుమ్ముల గంగాధర్, జంబిశెట్టి శంకర్, ఏషాల గంగాధర్, సుల్తాన్ సాయిలు, సింగం రాములు యాదవ్, గోపి, లేట్ షేక్ బాబు, లేట్ షేక్ ఫారుక్ తదితరులు నిందితులుగా ఉన్నారు.

 

 

 

సంవత్సరాలుగా కోర్టు విచారణ కొనసాగినప్పటికీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. దీంతో ఉద్యమ నాయకులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది.

 

 

 

ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని మూసివేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం సుమారు 200 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని తెలిపారు.

 

 

 

దీక్షలను పోలీసులు భగ్నం చేయడంతో నిరసనగా బోధన్ బంద్‌కు పిలుపునిచ్చామని, ఆ నేపథ్యంలో తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం కొనసాగిందని, చివరకు పోలీసులు ఆరోపణలు రుజువు చేయలేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసిందని చెప్పారు.

 

“ఈ విజయం రైతులది, కార్మికులది, బోధన్ ప్రజలది” అని బి. మల్లేష్ పేర్కొన్నారు.