కామారెడ్డి పాత బస్టాండ్లో పోలీసుల అవగాహన కార్యక్రమం.
కామారెడ్డి ప్రతినిధి:- కామారెడ్డి పాత బస్టాండ్లో గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దొంగతనాలు నివారించేందుకు పాటించాల్సిన సూచనలు, సైబర్ నేరాలపై అప్రమత్తత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పవద్దని సూచిస్తూ, సైబర్ నేరాల బాధితులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే షీ టీమ్ టోల్ ఫ్రీ నంబర్ 8712686094ను సంప్రదించాలని సూచించారు.
వేసవి సెలవుల సందర్భంగా చిన్నారులు ఈతకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి షీ టీమ్ సభ్యులు డబ్ల్యూపీసీ సౌజన్య, పీసీ భూమయ్యతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పాల్గొన్నారు.

