రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై పట్టణ స్థాయిలో అవగాహన.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై పట్టణ స్థాయిలో అవగాహన.

బాన్సువాడలో ఐదు వార్డుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలు విజయవంతం.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్:-  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు పట్టణాభివృద్ధి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐదు వార్డుల్లో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించారు.

 

 

 

2026 జూన్ 4, 6, 8 మరియు 10 తేదీలలో నిర్వహిస్తున్న వార్డు సభల షెడ్యూల్‌లో భాగంగా జూన్ 8న 5, 6, 7, 13, 19 వార్డుల్లో పురపాలక సంఘం చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

 

 

 

ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026, జల్ సంచయ్–జల్ భాగీదారి పథకం, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, మురుగు కాలువల శుభ్రత, వర్షాకాల సంసిద్ధత కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, నీటి నిల్వ నివారణ, పారిశుధ్య నిర్వహణ, రోడ్లు మరియు వీధి దీపాల నిర్వహణ అంశాలపై చర్చించారు.

అలాగే మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, యువజన సంక్షేమ కార్యక్రమాలు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు సంబంధించిన పథకాలపై ప్రజలకు వివరించారు.

 

 

 

ప్రజలకు ఇంకుడు గుంతల నిర్మాణం, తడి-పొడి చెత్త వేర్వేరు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలు మరియు వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల పురోగతి గురించి కూడా అవగాహన కల్పించారు.

 

 

ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ కాసుల విజయబాలరాజ్, 6వ వార్డు కౌన్సిలర్ అంజుం బేగం, 7వ వార్డు కౌన్సిలర్ శ్యామల మానస, 13వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ అబ్దుల్ ఖాలేక్, 19వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ మక్బూల్, కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, నాయకులు మహ్మద్ ఎజాజ్, పురపాలక సంఘ కమిషనర్ గోపు గంగాధర్‌తో పాటు పోలీస్, రెవెన్యూ, విద్యుత్, విద్య, నీటిపారుదల శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

 

వార్డు సభల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి సూచనలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.