రోడ్డు ప్రమాదం కాదది.. పక్కా ప్రణాళికతో హత్య.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ కులకర్ణి :- కన్న కొడుకునే హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటనలో తండ్రి, సోదరుడిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండలానికి చెందిన లక్ష్మణ్ (25) మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం తన తల్లిదండ్రులను వేధిస్తూ, దాడులకు పాల్పడేవాడు. గత నెల 21వ తేదీన మద్యం మత్తులో ఇంటికి వచ్చిన లక్ష్మణ్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులపై కర్రతో దాడి చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న అతని సోదరుడు శ్రీకాంత్ ఇంటికి చేరుకుని లక్ష్మణ్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. అదే సమయంలో తండ్రి గంగారం కూడా మరో కర్రతో దాడి చేయడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితులు ఇంట్లో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి, దాడికి ఉపయోగించిన కర్రలను దాచిపెట్టారు. అనంతరం లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించి అనుమానం రాకుండా తొందరపడి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే ఉదయం వేళల్లో హడావుడిగా దహన సంస్కారాలు నిర్వహించడం గమనించిన జీవీఓ శ్రీనివాస్‌కు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో గంగారం, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించారు. లక్ష్మణ్ తల్లి స్వరూప ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన బాన్సువాడ గ్రామీణ సీఐ తిరుపయ్య, ఎస్సై రాములు మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
