జిల్లా చెస్ పోటీల్లో సాయి సామల అకాడమీ విద్యార్థుల ప్రతిభ.

జిల్లా చెస్ పోటీల్లో సాయి సామల అకాడమీ విద్యార్థుల ప్రతిభ.

ముగ్గురు విద్యార్థులకు రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత.

బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-11 చెస్ సెలెక్షన్ టోర్నమెంట్‌లో బోధన్ పట్టణంలోని సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

 

 

 

బాలికల విభాగంలో ఎం. నిత్య శ్రీ ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, ఎస్. సాయి సహారా ద్వితీయ స్థానం సాధించి రజత పతకాన్ని గెలుచుకుంది. బాలుర విభాగంలో ఎం. హితేంద్ర తృతీయ స్థానం సాధించి ప్రతిభ చాటాడు.

జిల్లా స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఈ ముగ్గురు విద్యార్థులు ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అండర్-11 చెస్ ఛాంపియన్‌షిప్-2026లో పాల్గొననున్నారు.

 

 

 

ఈ సందర్భంగా అకాడమీ కోచ్, కోఆర్డినేటర్ సాయిబాబా సామల మాట్లాడుతూ, బోధన్ ప్రాంతంలోని విద్యార్థుల్లో చెస్ పట్ల ఆసక్తి పెంపొందించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడం తమ లక్ష్యమని తెలిపారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే చెస్ ఆటను మరింత మంది విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు.

విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్న ఆయన, రాష్ట్ర స్థాయిలో కూడా వీరు ఉత్తమ ప్రతిభ కనబర్చి బోధన్ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు, చెస్ ప్రేమికులు మరియు క్రీడాభిమానులు అభినందించారు.