నర్సాపూర్‌లో ‘భూభారతి’ భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు.
హాజరైన బోధన్ ఎమ్మార్వో విట్టల్ – భూములకు శాశ్వత హద్దులు, భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడి.
బోధన్ ప్రతినిధి రాహుల్:
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నర్సాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘భూభారతి’ భూముల రీ సర్వే కార్యక్రమంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రాంగణంలో బోధన్ తహసీల్దార్ (ఎమ్మార్వో) విట్టల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి గ్రామ రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో విట్టల్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, జీపీఎస్ ఆధారిత విధానంతో చేపడుతున్న ఈ రీ సర్వే ద్వారా ప్రతి భూమికి ఖచ్చితమైన సరిహద్దులు (GPS Coordinates) నిర్ధారించబడతాయని తెలిపారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు రైతుల భూ హక్కులకు మరింత రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు.

సర్వే పూర్తైన అనంతరం ప్రతి భూకమతానికి ఆధార్ తరహాలో ప్రత్యేక ‘భూధార్’ నంబర్ కేటాయించబడుతుందని, భూములకు సంబంధించిన రికార్డులు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. దీనివల్ల భూ లావాదేవీలు మరింత పారదర్శకంగా, వేగంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.
రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకాలు, లింక్ డాక్యుమెంట్లు, భూముల హద్దులకు సంబంధించిన వివరాలతో సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని ఎమ్మార్వో కోరారు. రికార్డుల్లో ఏవైనా పొరపాట్లు లేదా వ్యత్యాసాలు ఉంటే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాటిని సరిచేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ వార్డ్ కౌన్సిలర్ మనాన్, రెవెన్యూ సిబ్బంది (ఆర్ఐలు, వీఆర్వోలు), జిల్లా సర్వే అధికారులు, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, మొహిన్, పాషా బాయ్, అంకుదాము, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రీ సర్వే ప్రక్రియపై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
