బోధన్‌లో వరుణ మహాయాగం నిర్వహణ.
బోధన్ ప్రతినిధి రాహుల్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పిస్తూ బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో శుక్రవారం వరుణ మహాయాగం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాయాగంలో బాసర వేదభారతి విద్యాపీఠం వేదపండితులు, వేద విద్యానందగిరి స్వామీజీ ఆశీర్వచనాలతో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక హోమాలు, యజ్ఞయాగాదులు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.

సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రకృతిలో సమతుల్యత నెలకొనాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం స్వామీజీ ఆశీర్వచనంతో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. మహాయాగం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

