కామారెడ్డి లేబర్ అడ్డలో పోలీసుల అవగాహన కార్యక్రమం.
కామారెడ్డి ప్రతినిధి: వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దొంగతనాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, రోడ్డు భద్రతపై కామారెడ్డి లేబర్ అడ్డలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితులకు OTPలు చెప్పొద్దని, మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ అందుబాటులో ఉందని, అవసరమైతే 972686094 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. అలాగే వేసవి కాలంలో ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, సెలవుల సందర్భంగా చిన్నపిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాటలు, ప్రసంగాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి షీ టీమ్ పీసీ భూమయ్య, ట్రాఫిక్ పీసీ మొసిన్ ఖాన్, హెచ్‌జీ తిరుపతి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూలి పనుల కోసం వచ్చిన కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
