బోధన్‌లో విద్యా వారోత్సవాలపై అవగాహన సదస్సు.

బోధన్‌లో విద్యా వారోత్సవాలపై అవగాహన సదస్సు.

బోధన్ ప్రతినిధి రాహుల్:-  నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “విద్యా వారోత్సవాలు”పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బోధన్‌లోని లయన్స్ క్లబ్‌లో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 

 

ఈ సందర్భంగా డివిజన్ పంచాయతీ అధికారి నాగరాజు మాట్లాడుతూ, మే 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల ప్రధాన లక్ష్యం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి చిన్నారిని 100 శాతం పాఠశాలల్లో చేర్పించడం అని తెలిపారు. బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరచాలని, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సర్పంచులు పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాల్లో చురుకుగా పాల్గొని పాఠశాల అవసరాలను గుర్తించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

 

 

 

క్రీడలు, విద్యా రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను గుర్తించి సన్మానించడం ద్వారా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం పెంపొందించవచ్చని తెలిపారు. విద్యా వారోత్సవాల విజయవంతమైన నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో డివిజన్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంఈఓ నాగయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్, రాణి మంజుష, ఆంజనేయులు, ఎంపీడీఓ కిషోర్, ఆర్‌ఐ నాగేష్, నియోజకవర్గ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.