ప్రజల్లో చైతన్యం కోసం రాజంపేటలో పోలీస్ కళాబృందం ప్రత్యేక కార్యక్రమం.

ప్రజల్లో చైతన్యం కోసం రాజంపేటలో పోలీస్ కళాబృందం ప్రత్యేక కార్యక్రమం.

రాజంపేట ప్రతినిధి :- రాజంపేట మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో గురువారం సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

 

కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాజంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ బి. మహేష్ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు లేదా పోలీసులు ఎప్పుడూ ఫోన్‌లో ఓటీపీ అడగరని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

 

 

 

అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, మహిళల భద్రత కోసం షీ టీమ్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.

 

 

ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజశేఖర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కామారెడ్డి షీ టీమ్ సభ్యురాలు భాను రెడ్డితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బ్యాంకు వినియోగదారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.