బ్యాంక్ ఆఫ్ బరోడా కామారెడ్డిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.
ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు.
కామారెడ్డి ప్రతినిధి :- సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, బ్యాంక్ ఆఫ్ బరోడా కామారెడ్డి శాఖలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సైబర్ నేరస్థుల మోసపూరిత కాల్స్, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. బ్యాంక్ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఎప్పుడూ ఓటీపీ అడగరని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సంప్రదించాలని సూచించారు.

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని, వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అవగాహన కల్పించారు.
పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో Bank of Baroda కామారెడ్డి శాఖ చీఫ్ మేనేజర్ నితీష్, అసిస్టెంట్ మేనేజర్ రవి కుమార్, బ్యాంకు సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఖాతాదారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
