నిజాంసాగర్ కెనాల్‌పై అక్రమ నిర్మాణాల తొలగింపునకు వారం రోజుల గడువు.
వర్ని ప్రతినిధి చందర్: వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నిజాంసాగర్ కెనాల్‌పై అక్రమంగా నిర్మించిన దుకాణాలు, ఇతర నిర్మాణాల తొలగింపుపై బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వర్ని ఎంఆర్వో, ఎంపీవో, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, దుకాణ సముదాయాల యజమానులు హాజరయ్యారు. కెనాల్ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా వారం రోజులలోగా ఆక్రమణలను తొలగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు తొలగించని పక్షంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే అక్రమ నిర్మాణాలను తొలగించే చర్యలు చేపడతామని ఎంఆర్వో హెచ్చరించారు. కెనాల్ భూముల ఆక్రమణ చట్ట విరుద్ధమని, ఇటువంటి నిర్మాణాలు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారి ప్రజలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ భూములను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
