తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు – ఇండిరమ్మ ఇళ్లు, విద్య, లైఫ్ సైన్సెస్ రంగాలకు భారీ ప్రాధాన్యం.

 

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు – ఇండిరమ్మ ఇళ్లు, విద్య, లైఫ్ సైన్సెస్ రంగాలకు భారీ ప్రాధాన్యం.

హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్య, మౌలిక సదుపాయాలు, లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో రెండో విడతగా మరో 2 లక్షల 50 వేల పేద కుటుంబాలకు ఇండిరమ్మ ఇళ్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. గతంలో నిర్మాణం ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇండిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

 

 

పునాది పూర్తయిన ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తై స్లాబ్ దశలో ఉన్న ఇళ్లకు రూ.2 లక్షల సహాయం అందించనున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. మొదటి విడతలో నిర్మాణం ప్రారంభమైన ఇండిరమ్మ ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లు జూన్ 2 నాటికి గృహప్రవేశాలకు సిద్ధమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరామేరి మండలం కొత్తారి గ్రామంలో కోలం గిరిజనుల కోసం నిర్మించిన 28 ఇండిరమ్మ ఇళ్లను జూన్ 1న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి A. Revanth Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarkaతో పాటు మంత్రులు పాల్గొననున్నారు.

 

 

హైదరాబాద్ మహానగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తక్కువ ఆదాయ వర్గాల (LIG) కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నట్లు గుర్తించామని, వారికి వెంటనే ఇండిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. తెలంగాణను గుడిసెలులేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.


వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.1000 కోట్ల నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల చేయనున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSS పథకంలో తెలంగాణ డిస్కంలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించనున్నారు.

 

 

రాష్ట్రంలోని DCMSలను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని, అలాగే తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGRIC)ను హాకాలో విలీనం చేయాలని నిర్ణయించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయాల కోసం రూ.587 కోట్ల నిధులను మంజూరు చేశారు. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్-5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా “నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30”కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా వచ్చే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

 

 

లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు తయారీ రంగంపై ఉన్న దృష్టిని ఇకపై పరిశోధన, అభివృద్ధి (R&D) మరియు విలువ ఆధారిత ఇన్నోవేషన్ వైపు మళ్లించనున్నట్లు వెల్లడించింది.